విద్యారంగానికి మొండి చేయి చూపిన రాష్ట్ర బడ్జెట్: ఎస్ఎఫ్ఐ ఆగ్రహంబడ్జెట్ పత్రాల దహనం – విద్యకు 30% నిధులు కేటాయించాలని డిమాండ్

హనుమకొండ, మార్చి 21:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడంపై స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రాంనగర్ అంబేద్కర్ సెంటర్ వద్ద బడ్జెట్ పత్రాలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి కేవలం 8.22 శాతం నిధులు మాత్రమే కేటాయించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సుమారు రూ.8 వేల కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.
గురుకులాలకు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌కు సొంత భవనాలు లేకపోవడం, ప్రభుత్వ యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కేవలం రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించడం సరైన పరిష్కారం కాదని విమర్శించారు.
విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కనీసం 30 శాతం బడ్జెట్ కేటాయించాలని గత రెండు సంవత్సరాలుగా విద్యార్థి సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, తగిన నిధులు కేటాయించాలని కోరారు.
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, సహాయ కార్యదర్శి బిరెడ్డి జస్వంత్, జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి సాయికుమార్, మల్లేష్, సన్నీ, పవన్, సురాజ్, సాయి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post