అరడజన్ అబద్ధపు హామీలు… కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ధ్వజం

హనుమకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. “అరడజన్ అబద్ధపు హామీలు… 420 వేషాలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ ప్రజలను మోసం చేసింది” అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థి రావు పద్మ రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలో భారీ ర్యాలీ మరియు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
హనుమకొండ అదాలత్ జంక్షన్‌లోని అమరవీరుల స్థూపం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇంత కాలం గడిచినా ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ సమస్యలను పట్టించుకోకపోవడం, డి.ఏ. బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూ భారతి పేరుతో ఏర్పడిన గందరగోళాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, స్థానిక ప్రజా సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్టైల్ పార్క్ వంటి పథకాలను సక్రమంగా అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
బీజేపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల కాళీ ప్రసాద్ రావు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post