జయశంకర్ భూపాలపల్లి, మార్చి 23: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్‌పై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ కూడలిలో ప్రెస్ మీట్ నిర్వహించి బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి రూ. 3,24,234 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 65 శాతం జనాభా ఉన్న బీసీల కోసం కేవలం రూ. 12,511 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర అన్యాయమని విమర్శించారు.
బీసీల జనాభా శాతాన్ని అనుసరించి కనీసం 51 శాతం బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. ఆరోగ్య శాఖకు 4.1 శాతం, విద్యా శాఖకు 8.1 శాతం మాత్రమే కేటాయించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను, ప్రస్తుతం లక్షల కోట్ల అప్పులతో నడిపిస్తూ వడ్డీల రూపంలో భారీ భారం మోపుతున్నారని విమర్శించారు. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు చెల్లించడానికే అధిక నిధులు ఖర్చవుతున్నాయని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను పూర్తిగా వినియోగించకుండా కేవలం లెక్కల పరంగా మాత్రమే చూపిస్తూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, 16 మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బీసీ వర్గానికి చెందినవారని పేర్కొన్నారు.
తెలంగాణలో సంపద సృష్టించేది బీసీలేనని, కానీ అధికారంలో వారికి తగిన భాగస్వామ్యం ఇవ్వడం లేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో టీఆర్‌పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.
2028లో టీఆర్‌పీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, సత్వర న్యాయం ప్రధాన అజెండాగా తీసుకుని, ప్రతి వర్గానికి వారి హక్కు మేర బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. అలాగే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని, ప్రతి సంవత్సరం కనీసం రూ. 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, రేగొండ మండల మహిళా అధ్యక్షురాలు అనిత, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బండి సునీల్, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా కోఆర్డినేటర్ మామిడి శ్రీకాంత్, జిల్లా కోశాధికారి జిలకర శ్రీను, సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్, జిల్లా నాయకులు మడే సంతోష్, ఇనుగాల ప్రణీత్, లక్ష్మణ్, అల్లం రామ్ చరణ్, కృష్ణ మనోహర్ రావు, మేనం సంతోష్, మడే సతీష్, భువనగిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment