సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో ప్రారంభమయ్యాయి. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. బాల్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె. రామకృష్ణ, సీపీఐ సెంట్రల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ తన బలాన్ని నిరూపించుకుందని తెలిపారు. తమతో పొత్తు లేకపోతే ఏమి జరుగుతుందో ఇతర పార్టీలకు ఒక హెచ్చరికగా మారిందని అన్నారు.
రేవంత్ రెడ్డితోనే తేల్చుకుంటాం
సీపీఐ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ పొత్తు ధర్మాన్ని కచ్చితంగా పాటిస్తుందని, అయితే ఇతర పార్టీలు మాత్రం ఆ విధంగా వ్యవహరించడం లేదని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మానికి విఘాతం కలిగించిందని విమర్శించారు.
రానున్న ఎన్నికల్లో పొత్తుల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి చర్చించి తేల్చుకుంటామని కూనంనేని స్పష్టం చేశారు. తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందినప్పటికీ తమకు మాత్రం పెద్దగా లాభం కలగలేదని అన్నారు.
అధికార పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.
Post a Comment