మాందారిపేట అంగన్వాడీలో ఎక్స్‌పైర్ గుడ్లు పంపిణీ ఆరోపణలుటీచర్‌పై చర్యలు తీసుకోవాలని గర్భిణీలు, బాలింతల డిమాండ్

BLN తెలుగు దినపత్రిక, శాయంపేట మార్చి 2:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పరిధిలోని మాందారిపేట స్టేజి సమీపంలోని అంగన్వాడి కేంద్రంలో ఎక్స్‌పైర్ అయిన కోడిగుడ్లు గర్భిణీలు, బాలింతలకు పంపిణీ చేస్తున్నారన్న ఆరోపణలు వెలువడ్డాయి. సంబంధిత అంగన్వాడి టీచర్ కొమ్ముల స్వరూపపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
మాందారిపేట గ్రామానికి చెందిన కొమ్ముల సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం, తాను అంగన్వాడి కేంద్రంలో పేరు నమోదు చేసుకుని గర్భిణీ, బాలింతల కోసం ప్రభుత్వం అందించే గుడ్లు, పాలు, బాలామృతం వంటి పోషకాహార పదార్థాలను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో ఒకసారి పాడైన గుడ్లు తీసుకుని వాడటంతో తన మూడు నెలల పాపకు తీవ్ర జ్వరం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని ఆరోపించారు.
ప్రస్తుతం తన పాపకు 12 నెలల వయస్సు ఉందని, ఇటీవల అందించిన గుడ్లపై గడువు తేదీ జనవరి నెలగా ఉందని గుర్తించామని తెలిపారు. ఈ విషయంపై టీచర్‌ను ప్రశ్నించగా “ఇవి నిన్ననే వచ్చాయి, తీసుకుంటే తీసుకోండి లేకుంటే వద్దు” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు.
అంగన్వాడి కేంద్రాల ద్వారా సరఫరా అయ్యే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంతో ఆటలాడకూడదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన పోషకాహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post