ఆటో డ్రైవర్లు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: సీపీ సన్ ప్రీత్ సింగ్

వరంగల్: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమాన్ని ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాజీపేట రైల్వే ఆడిటోరియంలో వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వలన ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు. ప్రయాణికుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని, మితిమీరిన ప్రయాణికులను ఎక్కించకూడదని తెలిపారు.
డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ రోడ్డు నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు.
అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, జీబ్రా క్రాసింగ్ వద్ద జాగ్రత్తలు తీసుకోవడం, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగంపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతపై తమ బాధ్యతను గుర్తించి, నిబంధనలు పాటిస్తామని ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ట్రాఫిక్ కాజీపేట ఏసీపీ సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వెంకన్న, సీతారెడ్డి, సుజాత, కాజీపేట ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post