2024 కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తరువాత సినిమాల్లో అవకాశాలు పొందిన యువ నటి మోనాలిసా భోస్లే పెళ్లి విషయంలో తండ్రి ఒత్తిడిపై కేరళ పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆమె ఒక మలయాళం సినిమాలో నటిస్తూ తిరువనంతపురంలో ఉన్నట్లు సమాచారం.
బుధవారం ఉదయం మోనాలిసా తన ప్రియుడితో కలిసి తిరువనంతపురంలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తనకు ఇష్టంలేని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అయితే మతాంతర వివాహం కావడంతో మోనాలిసా తండ్రి దీనికి అంగీకరించకపోవడంతో వివాదం తలెత్తినట్లు తెలిసింది. తన ప్రేమ విషయం తెలిసిన తర్వాత నుంచి తండ్రి ఇతర సంబంధాలు చూస్తూ తనపై పెళ్లి ఒత్తిడి తెస్తున్నాడని ఆమె పేర్కొంది.
కేరళలో షూటింగ్‌కు మోనాలిసా తన తండ్రితో కలిసి వెళ్లిన సమయంలో కూడా పెళ్లి విషయంపై ఒత్తిడి కొనసాగడంతో ఆమె తన ప్రియుడికి సమాచారం ఇచ్చింది. అనంతరం అతడు కూడా కేరళకు చేరుకొని ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే మోనాలిసా తండ్రిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మోనాలిసాకు 18 సంవత్సరాలు నిండినందున ఆమె మేజర్ అని, ఎవరిని వివాహం చేసుకోవాలన్నది పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయం అని పోలీసులు స్పష్టం చేశారు. ఆమె ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం చట్టరీత్యా తప్పు అని హెచ్చరించారు.
కౌన్సిలింగ్ అనంతరం ముగ్గురినీ పోలీసులు స్టేషన్ నుండి పంపించినట్లు సమాచారం.
Post a Comment