తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో శాసనసభ స్పీకర్ సంచలన నిర్ణయం వెల్లడించారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తూ స్పీకర్ తీర్పు ఇవ్వడంతో వారికి ఊరట లభించింది.
ఈ కేసులో విచారణ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పీకర్‌కు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. ఆ వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్, దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరి బీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ తాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జవాబుదారీగా ఉంటానని తెలిపారు. ఇన్ని రోజులుగా తనపై ఫిర్యాదు చేసిన వారిపై మాట్లాడలేదని, తనపై ఏ అధికారంతో ఫిర్యాదు చేశారో ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని అన్నారు. కొందరు వ్యక్తిగతంగా తనపై ఫిర్యాదు చేశారని, వాటికి తాను సమాధానం ఇచ్చానని చెప్పారు. స్పీకర్ పరిధిలో తాను ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు.
తీర్పు ఎలా ఉన్నా తన లక్ష్యం పార్లమెంట్‌కు వెళ్లడమేనని, అందుకే ఎన్నికల్లో పోటీ చేశానని దానం నాగేందర్ తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. అవసరమైతే ఉప ఎన్నికలకు కూడా సిద్ధమని, పాదయాత్ర చేసి మళ్లీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీ ఫిరాయింపుల కేసులో గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు స్పీకర్ తాజా తీర్పుతో తెరపడింది. మొత్తం పదిమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వగా, తాజాగా దానం నాగేందర్ మరియు కడియం శ్రీహరిలపై వాదనలు విన్న అనంతరం వారిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేనని స్పష్టంచేశారు.
ఈ కేసులో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనున్న నేపథ్యంలో బుధవారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Post a Comment