BLN తెలుగు దినపత్రిక.న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచి కేటాయించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా జరిగిన భేటీలో రాష్ట్ర పోలీసింగ్ అవసరాలు, భద్రతా సవాళ్లపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని, 2021లో జరగాల్సిన రెండో క్యాడర్ రివ్యూ ఆలస్యంగా 2025లో మాత్రమే నిర్వహించారని సీఎం గుర్తుచేశారు. ఆ సమయంలో తెలంగాణకు కేవలం ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే కేటాయించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారని, ఆ సంఖ్యను 103కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 సంవత్సరంలోనే చేపట్టాలని కోరారు.
దేశంతో పాటు తెలంగాణ కూడా సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ నగర విస్తరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో Hyderabad, Cyberabad, Malkajgiri కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ అవసరం ఉందని తెలిపారు. అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనర్ వ్యవస్థ ఏర్పాటుకు కూడా పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారులు అవసరమని వివరించారు.
భేటీ సందర్భంగా మావోయిస్టుల లొంగుబాటుపై కూడా చర్చ జరిగింది. గత రెండేళ్లలో రాష్ట్ర పోలీసింగ్‌లో గణనీయమైన మార్పులు వచ్చాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల పలువురు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడపడానికి ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం పరిహారం, పునరావాసం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు.
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి సహకరించాలని కూడా సీఎం కోరారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషాద్రి, రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబి ఐజీపీ బి. సుమతి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment