నకిలీ జర్నలిస్టుల అరెస్ట్ మీడియా ముసుగులో బెదిరింపులు – నలుగురు అదుపులో

షాద్‌నగర్, మార్చి 24:మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు దోచుకుంటున్న నలుగురు నకిలీ జర్నలిస్టులను షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ సోమవారం వెల్లడించారు.
ఫరుఖ్‌నగర్ మండలం విట్యాల గ్రామానికి చెందిన రైతు కిషన్ నాయక్ తన వ్యవసాయ పొలాన్ని చదును చేయించేందుకు గంగా భుయాన్‌ను కోరాడు. పని పూర్తి చేసిన అనంతరం మిగిలిన మట్టిని ఆదివారం రాత్రి గంగా భుయాన్ తన టిప్పర్ వాహనం (టీఎస్ 07 యుఎల్ 3031)లో షాద్‌నగర్‌కు తరలిస్తున్నాడు.
ఈ క్రమంలో పీర్లగూడెం గ్రామ గేటు వద్ద రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన నలుగురు వ్యక్తులు టిప్పర్‌ను అడ్డగించి, తాము జర్నలిస్టులమని చెప్పుకొని రూ. 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే టిప్పర్‌ను సీజ్ చేయిస్తామని బెదిరించారు.
అంతటితో ఆగకుండా డ్రైవర్ వద్ద ఉన్న రూ. 5,500 నగదును బలవంతంగా లాక్కొని, మరిన్ని డబ్బుల కోసం టిప్పర్ యజమానికి ఫోన్ చేసి రూ. 20 వేల రూపాయలను ఆన్‌లైన్‌లో పంపించాలని ఒత్తిడి చేశారు.
అయితే యజమాని డబ్బులు పంపడంలో ఆలస్యం చేయడంతో అనుమానం చెందిన నిందితులు టిప్పర్‌లోని మట్టిని విట్యాల గ్రామంలో ఖాళీ చేయించి, వాహనాన్ని మరియు డ్రైవర్‌ను వదిలి పరారయ్యారు.
టిప్పర్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. విట్యాల గ్రామానికి చెందిన ఒగ్గుల రాజు, గడియ రాఘవేంద్ర గౌడ్, పీర్లగూడెం గ్రామానికి చెందిన ఆకులమోని జగన్, గంగాధర్‌పల్లి గ్రామానికి చెందిన బోయ శ్రీశైలంలను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో వీరిలో ఎవరూ జర్నలిస్టులు కాదని పోలీసులు నిర్ధారించారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post