నకిలీ పోలీస్ అరెస్ట్ – జాతరలో బెదిరించి డబ్బులు దోచుకున్న నిందితుడు పట్టుబడి రిమాండ్

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో నకిలీ పోలీస్‌గా నటిస్తూ ఓ వ్యక్తిని బెదిరించి డబ్బులు దోచుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కురవి ఎస్సై గండ్రాతి సతీష్ వెల్లడించారు.
మరిపెడకు చెందిన పులిచింత శ్రీనివాస్ ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా కురవి జాతరకు వచ్చాడు. జాతరలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పు వాయిద్యాల మధ్య మహిళల నృత్యాలను వీక్షిస్తుండగా, ఓ వ్యక్తి అతనిని పక్కకు పిలిచాడు. తాను కురవి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ కానిస్టేబుల్‌నని చెప్పుకొని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నావని ఆరోపిస్తూ అరెస్ట్ చేస్తానని బెదిరించాడు.
అతని మాటలకు భయపడిన శ్రీనివాస్‌ను డబ్బులు ఇస్తే వదిలేస్తానని, లేదంటే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితుడి వద్ద ఉన్న రూ.18,400 నగదును తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా, మరింత డబ్బులు ఇవ్వకపోతే లాఠీతో కొడతానని బెదిరించి, అతని సెల్‌ఫోన్ ద్వారా ఫోన్‌పే ద్వారా మరో రూ.3,900 తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు.
కొన్ని రోజుల తరువాత ఈ ఘటనపై అనుమానం వచ్చిన శ్రీనివాస్, కురవి పోలీస్ స్టేషన్‌లో విచారణ చేయగా, రాజు అనే కానిస్టేబుల్ ఎవరూ లేరని తెలిసింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఫోన్‌పే లావాదేవీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. మహబూబాబాద్ మండలం గాంధీపురానికి చెందిన ఎర్పుల నాగరాజును అరెస్ట్ చేసి, అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, ఎవరు పోలీసులమని చెప్పి బెదిరించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post