భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవం.. లక్షలాది భక్తుల రాకతో ఉత్సవ వాతావరణం

భద్రాచలం, మార్చి : త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో కౌసల్య దేవికి శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అదే రోజు శ్రీరామనవమిగా పిలవబడుతూ, భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహా వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
బ్రహ్మ పురాణం ప్రకారం భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన వారికి అశ్వమేధయాగ ఫలం లభిస్తుందని విశ్వాసం. ఈ నేపథ్యంలో రేపు జరిగే జగదాభిరాముని కళ్యాణానికి దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాద్రి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
పాంచారాత్ర ఆగమం ప్రకారం దేవుని అవతారం జరిగిన రోజునే ఆయన కళ్యాణం నిర్వహించాలని పేర్కొనబడింది. ఈ ఆచారాన్ని భక్త రామదాసు ప్రారంభించగా, అప్పటి నుండి భద్రాచలంలో శ్రీరాముని జన్మదినానికే కళ్యాణం నిర్వహించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. భద్రాద్రిలో జరిగే కళ్యాణం ఆధారంగా దేశవ్యాప్తంగా ఇతర ఆలయాల్లో కూడా అదే రోజు సీతారాముల కళ్యాణాలు నిర్వహిస్తారు.
ఈ ఏడాది నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. తదుపరి రోజు జరిగే మహా పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో సుమారు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
భద్రాచలంలో కళ్యాణ మండపం విశిష్టత ప్రత్యేకంగా నిలుస్తుంది. 1960లో ప్రారంభమైన ఈ మండప నిర్మాణం ప్రసిద్ధ శిల్పాచార్యులు గణపతి స్థపతి ఆధ్వర్యంలో జరిగింది. ఆకుపచ్చ, నల్ల రాళ్లతో నిర్మించిన ఈ మండపం అద్భుత శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. 16 స్తంభాలతో నిర్మించిన ఈ ‘షోడశ స్తంభ మండపం’లో రామాయణానికి సంబంధించిన అనేక శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
శ్రీరామనవమి రోజున భద్రాద్రిలో రెండు సార్లు కళ్యాణం నిర్వహించడం ప్రత్యేకత. ఉదయం గర్భగుడిలో ధ్రువమూర్తులకు కళ్యాణం నిర్వహించిన అనంతరం, మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో ఉత్సవమూర్తులకు మహోత్సవంగా కళ్యాణం జరుగుతుంది. ఈ ముహూర్తాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు.
భద్రాద్రి కళ్యాణంలో మరో విశిష్టత మూడు తాళిబొట్లు కలిగిన మంగళసూత్రం. దశరథ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు తరఫున మూడు తాళిబొట్లు ధరింపజేయడం ప్రత్యేక సంప్రదాయం. అలాగే ఎరుపు రంగులో ఉండే తలంబ్రాలు కూడా భద్రాద్రి కళ్యాణానికి ప్రత్యేక ఆకర్షణ. తానీషా కాలం నుండి వస్తున్న గులాల్ సంప్రదాయం కారణంగా తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి.
ప్రతి సంవత్సరం జరిగే ఈ మహోత్సవాన్ని లక్షలాది భక్తులు కన్నులపండుగగా వీక్షిస్తారు. భక్తిశ్రద్ధలతో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం భద్రాద్రి మహిమను మరింతగా చాటుతోంది.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post