శాయంపేట మండలంలోని తహరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖ చేపట్టిన 11కేవీ లైన్ మార్పుపై వివాదం నెలకొంది. ఈ పనుల్లో ప్రజా ధనం దుర్వినియోగం జరుగుతోందని . తాటికొండ రవి కిరణ్ ఆరోపించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా ఉన్న అసైన్ భూమిలో గల 11కేవీ విద్యుత్ లైన్‌లో కొంత భాగాన్ని ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు మార్చడానికి చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కారణంగా లైన్ మార్పు చేపడుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, అక్కడ కేవలం రెండు ఇళ్లకే ఇబ్బంది ఉన్నదని, వాటికి ఒకటి లేదా రెండు పోల్స్ మార్చితే సరిపోతుందని పేర్కొన్నారు.
అయితే అవసరం లేకుండా సుమారు 20 పోల్స్ మార్పు చేపట్టడం అనవసరమని, దీని ద్వారా సుమారు రూ.25 నుండి 30 లక్షల వరకు ప్రజా ధనం వృథా అవుతుందని ఆరోపించారు. కేవలం లేబర్ మరియు యంత్రాల ఖర్చు కోసం రూ.5 లక్షల అంచనా వేయడం కూడా అనుమానాస్పదమని అన్నారు.
లైన్ మార్పు పనులపై స్థానిక ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, విద్యుత్ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేయించారని, ప్రజలను స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, కొన్నిసార్లు గృహాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి, కేవలం వీధి దీపాలకు మాత్రమే విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు.
అలాగే 90 డిగ్రీల కోణంలో నాలుగు క్రాసింగ్స్ ఏర్పాటు చేయడం ప్రమాదకరమని తెలిసినా, అధికారులు పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని విమర్శించారు. కొందరు స్థానిక నేతలు డబ్బులు వసూలు చేసి ఈ పనులను ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, అవసరం ఉన్న ఇళ్ల వరకే లైన్ మార్పు చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజా ధనాన్ని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
Post a Comment