మున్సిపల్ క్లైమాక్స్…

మున్సిపల్ క్లైమాక్స్…
రేపు పీఠాల పోరు!
చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధం
హంగ్ ఉన్న చోట్ల ఉత్కంఠ… స్వతంత్రులే కింగ్‌మేకర్లు
ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
మధ్యాహ్నం 12:30కు ప్రత్యేక సమావేశంలో ఎన్నిక
జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేటలో టెన్షన్
క్యాంపు రాజకీయాలతో సభ్యులను కాపాడుకునే ప్రయత్నాలు
BLN తెలుగు దినపత్రిక : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు రేపు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎన్నికైన కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికలతో మున్సిపల్ రాజకీయాలకు క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలు ఉండగా, ఇటీవల వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 7 మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు, స్టేషన్ ఘన్‌పూర్, డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ బలం బలంగా ఉంది. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో ఈ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

నాలుగు చోట్ల హంగ్… ఉత్కంఠ రేపుతున్న పీఠాల పోరు

జనగామ, మహబూబాబాద్, కేసముద్రం, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొనడంతో చైర్‌పర్సన్ ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. ముఖ్యంగా జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 12, సీపీఎం 1, స్వతంత్రులు 4 స్థానాలు గెలుచుకున్నారు. చైర్‌పర్సన్ పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 16 ఓట్ల కోసం స్వతంత్రులు, ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారాయి. ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, చైర్‌పర్సన్ పదవిపై పార్టీ అంతర్గత పోటీ నెలకొంది. నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య పోటీ తీవ్రంగా కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్‌లోనే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

క్యాంపు రాజకీయాలు… సభ్యులపై పార్టీల నిఘా

హంగ్ పరిస్థితులు నెలకొన్న మున్సిపాలిటీల్లో సభ్యుల మద్దతు కోల్పోకుండా ఉండేందుకు ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. కౌన్సిలర్లను రహస్య ప్రదేశాలకు తరలించి, ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిటెడ్ అధికారులను ప్రిజైడింగ్ అధికారులుగా నియమించింది. కోరం పూర్తి అయిన తర్వాతే ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మున్సిపల్ పీఠాల కోసం రేపు జరగనున్న ఎన్నికలు రాజకీయంగా కీలకంగా మారాయి. ముఖ్యంగా హంగ్ ఉన్న మున్సిపాలిటీల్లో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగనున్న నేపథ్యంలో చైర్‌పర్సన్ పీఠం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post