ఆపదలో ఉన్న వారికి 108 సేవలు ప్రాణదాతలు: జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్

శాయంపేట, ఫిబ్రవరి 28:
ఆపదలో ఉన్న ప్రజలకు 108 అంబులెన్స్ సిబ్బంది ప్రాణదాతలుగా పనిచేస్తున్నారని 108 సేవల జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ అన్నారు. శనివారం శాయంపేట మండల కేంద్రంలోని 108 అంబులెన్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా అంబులెన్సులో ఉన్న అత్యవసర మందులు, వైద్య పరికరాల పనితీరును నిశితంగా పరిశీలించారు. మందుల కాలపరిమితి, నిర్వహణ రిజిస్టర్లు పరిశీలిస్తూ పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కాల్ వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన స్పందించి, ప్రమాద స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి బాధితులను సురక్షితంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం ప్రథమ కర్తవ్యమని దిశానిర్దేశం చేశారు.
పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశముందని పేర్కొంటూ, అంబులెన్సులో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గ్లూకోజ్, ఐస్ ప్యాక్స్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎండాకాలంలో వచ్చే అత్యవసర కేసులపై ప్రత్యేక అప్రమత్తత అవసరమని సూచించారు.
గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో సుమారు 150 అత్యవసర కేసుల్లో సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బందిని మండ శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఈఎంటీ కందకట్ల సుధారాణి, పైలెట్ మండ కేదారి తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post