పసిపిల్లల బడిలో పాములు, పందికొక్కులు.. అక్కడే చిన్నారి బాలల "అంగన్వాడీ" చదువులు..

ఫరూక్ నగర్ అంబేద్కర్ కాలనీలో కనిపించిన దుస్థితి.. 
గతంలో పరిశీలించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
ఆయన సూచన మేరకు నేడు కాంగ్రెస్ నేతల పరిశీలన..
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సొంత నిధులతో ఫ్లోరింగ్ ఏర్పాటుకు నిర్ణయంపసిపిల్లలు చదువుకోవాల్సిన అంగన్వాడీ కేంద్రంలో పాములు సంచరిస్తున్నాయి.. పందికొక్కులు, ఎలుకలు విజృంభిస్తున్నాయి.. పట్టించుకునే వారు లేక శిధిలమైన భవనం ఇలా ప్రమాదకరంగా మారగా ఇంకా అక్కడే పిల్లల చదువులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఫరూక్ నగర్ అంబేద్కర్ కాలనీలో అంగన్వాడి కేంద్రం దుస్థితి ఇది. గతంలో వార్డు పర్యటనలో భాగంగా ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించిన షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ దానిని బాగు చేయాలన్న సంకల్పంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులను అక్కడికి వెళ్లి మౌలిక సదుపాయాలను పరిశీలించాలని పంపించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన ,ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ పి. రఘు, సీనియర్ నేత కృష్ణారెడ్డి, చెంది తిరుపతి రెడ్డి, మహమ్మద్ ఇబ్రహీం, అగ్గునూరు బస్వం, ముబారక్ అలీ ఖాన్, అందేమోహన్, మురళీమోహన్ అప్పి తదితర స్థానిక అంబేద్కర్ కాలనీ నాయకులు పరిస్థితిని ప్రత్యక్షంగా వీక్షించారు. దానిని పునరుద్ధరించేందుకు సంకల్పించారు. ఎమ్మెల్యే సొంత ఖర్చుతో అక్కడ అంగన్వాడి కేంద్రంలో బండలు వేయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాయకులు వెల్లడించారు. అంతకుముందు అంగన్వాడి ఆయాను టీచర్ రాలేదా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఈరోజు ఆలస్యమైందని వారు చెప్పడంతో అంగన్వాడి పాఠశాల పరిస్థితి పై వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మరీ ఇంత దారుణమా..?అంబేద్కర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన స్థానిక వ్యవసాయ కమిటీ మార్కెట్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, గిరిజన, ఆదివాసి కోఆర్డినేటర్ పి. రఘు నాయక్ మాట్లాడుతూ ఇంతకాలంగా అంగన్వాడి కేంద్రం పూర్తిస్థాయి శిథిలావస్థలో ఉన్నప్పటికీ గత నాయకులు ఎవరు పట్టించుకోవడం శోచనీయమన్నారు. వార్డుకు గత కౌన్సిలర్ ఉన్నప్పటికీ ఈ చిన్న సమస్యను కూడా ఎవరి దృష్టికి తీసుకు రాకపోవడం, కనీసం దాతల సహకారంతో నైనా బాగు చేయించకపోవడం దారుణం అన్నారు. ఇలాంటి ప్రతి సమస్యను వార్డుల వారిగా తిరిగి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. అత్యంత చిన్నారులు చదువుకునే ఇలాంటి కేంద్రాలు ప్రమాదరహితంగా ఉండాలని, చిన్నారుల రక్షణ అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. వార్డుల వారీగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వాటిపై కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో దృష్టి పెడుతుందని ఆయన స్పష్టం చేశారు. వార్డు ప్రజలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా ఎమ్మెల్యే దృష్టికి వార్డు నాయకుల ద్వారా తీసుకురావాలని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ కృషిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.. 

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post