అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు అభివృద్ధికి ముందుకు సాగాలి
మహిళా సాధికారితే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది
దామెర మండలం ల్యాదల్ల లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరకాల స్కిల్ డెవలప్మెంట్, మినీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ వుమెన్ ప్రాంగణంలో ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు ప్రకాశ్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వి-హబ్ సీఈవో సీతా, ఇతర అధికారులు
పరకాల నియోజకవర్గానికి చెందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేందుకు పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ను దృఢ సంకల్పంతో ఏర్పాటు చేస్తున్నామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా దామెర మండలం ల్యాదెల్లల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కార్యక్రమం ( ఓరియంటేషన్ ప్రోగ్రాం )ను సెర్ప్, వి-హబ్, డి ఆర్ డి ఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఇతర అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మొక్కలు నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ...మాట్లాడుతూ ప్రతి ఇంటిలోఒక మహిళ ప్రాథమికంగా చిన్న పారిశ్రామికవేత్తగా అంచెలంచలుగా ఎదగడానికి ఇది ఒక పునాది అని పేర్కొన్నారు. ఆలోచన, ఉత్సాహం ఉంటే సరిపోదని దానికి ఎంతోమంది సహకారం అవసరమని అన్నారు. ఒకరోజు పేపర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా, కోటీశ్వరులను చేయాలనే వివరాలతో కూడిన వార్తను తాను చదివిన తర్వాత పరకాల నియోజకవర్గంలోని మహిళలను ఆర్థికంగా ఎదిగే విధంగా తోడ్పాటు అందించాలని బలమైన సంకల్పం తనలో కలిగిందన్నారు. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా అండగా నిలిచారని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ, వి-హబ్ అధికారులతో పలుమార్లు సుదీర్ఘంగా చర్చించి పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు మహిళా డెయిరీ,ఏర్పాటుకు కార్యరూపం తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, డిఆర్డిఏ, వీ హబ్ అధికారులు తాను ఊహించిన దానికంటే ఎక్కువగా పనిచేశారని, అందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలనే ఆలోచన తనదని, దాన్ని కార్యరూపం దాల్చేలా చేసింది జిల్లా కలెక్టర్, డిఆర్డిఓ, ఇతర అధికారుల కృషి, సహకారంతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళా శక్తిని తట్టుకునే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదని, సాధ్యము కాదు అని అన్నారు. ఒక ఇంట్లో మహిళ ఆలోచనా విధానంతోనే ఆ కుటుంబంలోని భవిష్యత్ తరాలు బాగుంటాయని పేర్కొన్నారు. అందుకే మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఆలోచన చేసి ముందుకు సాగాలని అన్నారు. తాను తొలిసారిగా 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికై వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. 1999లోను దేశంలో మరెక్కడా లేని విధంగా పాకాల మహిళా బ్యాంకును ఏర్పాటు చేశామని, ఇప్పుడు దాని మూలధనం రూ. ఐదు కోట్ల టర్నోవర్ తో విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. ఆనాడే ప్రతి మండలంలో మహిళా సమైక్య భవనాలను నిర్మించామన్నారు. పాకాల మహిళా బ్యాంక్ నేటికి విజయవంతంగా సాగుతుందంటే మహిళల క్రమశిక్షణ, అంకితభావమేనని అన్నారు. పరకాల నియోజకవర్గానికి చెందిన మహిళలు ఆర్దిక పురోభివృద్ధిని సాధించేందుకు స్కిల్ డెవలప్మెంట్, డెయిరీ, స్టిచ్చింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు అందించడానికి తనతో పాటు అధికారులు ఉన్నారని, ఇక మీరే అభివృద్ధి చెందాలని మహిళలను ఉద్దేశించి అన్నారు. మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో తయారయ్యే వస్తువులు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి కూడా వి-హబ్ తోడ్పాటునందిస్తుంద న్నారు. పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కలెక్టర్, అధికారుల సహకారంతో దేశంలోనే పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు ప్రత్యేక గుర్తింపు పొందే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికి మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళా డెయిరీ ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ మహిళలు సాధికారతను సాధించాలని అన్నారు. మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల అభివృద్ధికి విహబ్ ను ఏర్పాటు చేసిందన్నారు. వి హబ్ ద్వారా మహిళలు చేసే బిజినెస్ ను ప్రోత్సహించాలి, మార్గ నిర్దేశం, మార్కెటింగ్ చేయడానికి, నిధులు సమకూర్చడం చేస్తుందన్నారు. వి హబ్ వివిధ కార్యక్రమాలను చాలా విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. ఖమ్మం లో తాను పనిచేసినప్పుడు వి హబ్ భాగస్వామ్యం తో మహిళా ఫెడరేషన్ ద్వారా మిర్చి కొనుగోలు చేసి సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు ఆ మహిళా సంఘాలకు వచ్చాయన్నారు. మహిళలు ఏదైనా చేయాలనుకుంటే లిమిట్స్ లేవన్నారు. మహిళలు ఏదైనా చేయడానికి ముందుకు వచ్చినట్లయితే శిక్షణ ఇవ్వడానికి, తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రపంచ కుబేరులలో టాప్ 5 లో ఉన్న వారెన్ బఫెట్ ను ఒకరు అడిగిన ప్రశ్నకు సమాదానమిస్తూ మహిళా సాధికారత ఆ రోజుల్లో ఉంటే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కానని అన్నారట. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు మహిళా సాధికారతకు ఎంత ప్రాముఖ్యత ఉందని అన్నారు. మహిళా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు పేరొందిన శిక్షణ సంస్థలను వచ్చేటట్లు ఎమ్మెల్యే కృషి చేశారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వీ హబ్ సీఈవో సీత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు ఆర్థిక బలాన్ని వీ హబ్ అందించి ప్రోత్సహిస్తుందన్నారు. మహిళలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తమ వంతు భాగస్వామ్యాన్ని అందిస్తామన్నారు. లాదేళ్లలో ఏర్పాటు చేస్తున్న పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ జాతీయస్థాయిలో రోల్ మోడల్ గా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను మాట్లాడుతూ పరకాల మహిళా స్కిల్ డెవలప్మెంట్, మినీ మ్యానుఫ్యాక్చరింగ్, మహిళా డెయిరీ ఏర్పాటు గురించిన వివరాలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, దామెర తహసిల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, వీహబ్ ప్రతినిధులు, పరకాల నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment