చేతిలో ఏకే-47 తుపాకీ ధరించి, చుట్టూ అధునాతన ఆయుధాలతో సహచరుల కాపలా గల ఓ నక్సల్ నాయకుడితో గంట సేపు వాగ్వాదానికి దిగితే ఎలా ఉంటుంది? ఊహించడానికే కాస్త భయంగా ఉంటుంది కదా? ఈ అంశంలో నేనేదో తోపునని చెప్పే ఉద్దేశం కాదిది.. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణేష్ అలియాస్ గాజర్ల రవిలోని మరో కోణాన్ని గుర్తు చేసే ఘటన మాత్రమే. సమసమాజ స్థాపన లక్ష్యంతో అడవిబాట పట్టిన అన్నలతోనూ అర్థవంతమైన వాదన చేస్తే ఓ మనిషి ప్రాణం కాపాడగలమనే నమ్మకాన్ని నింపిన జ్ఞాపకం ఇది. నిన్న అల్లూరు సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ మృతి చెందిన సంగతి తెలిసిందే. గణేష్ ఉద్యమ నేపథ్యం, ఆయన సోదరులందరూ విప్లవ పంథాలోనే పయనించడం, గణేష్ శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహిరించినటువంటి అనేక అంశాలపై చాలా కథనాలు వచ్చాయి. తెలంగాణాలో గణేష్ గా విప్లవోద్యమంలో ప్రాచుర్యం పొందిన గాజర్ల రవి ఏవోబీలో ఉదయ్ గా పేరు గాంచారు. ఇంతకీ గణేష్ తో గంట సేపు వాదన దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే..?
దాదాపు రెండు దశాబ్ధాల క్రితం.. తేదీ గుర్తులేదుగాని.. నేను ‘వార్త’ పత్రికలో ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జిగా పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఆఫీసుకు వచ్చి, పరిసరాలను అటూ, ఇటుగా పరికించి, నావైపు తిరిగి సమ్మిరెడ్డి అంటే నువ్వేనా? అని ప్రశ్నించాడు. యాపిల్ మ్యాక్ కంప్యూటర్ లో వార్త రాసుకుంటున్న నేను తలెత్తి చూసి.. ఔను నేనే ఏంటి..? అని ప్రశ్నించాను. ‘అన్నా.. మిమ్మల్ని గణేష్ రమ్మన్నాడు’ అని చెప్పాడు. ఏ గణేష్? అని ప్రశ్నించాను. పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్టు పార్టీ) గణేష్ అన్నాడు. రావలసిన తేదీ, సమయం, ప్రాంతం తెలిపి.. అన్న తప్పకుండా రమ్మని చెప్పాడు. ఏదో ఇంటర్వ్యూ ఇస్తారేమో..? అని చెప్పి అతను వెళ్లిపోయాడు. అప్పటికే గణేష్ కేకేడబ్ల్యూ (ఖమ్మం, కరీంనగర్, వరంగల్) కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్య నేతే కదా? ఏదేని ముఖ్యాంశం చెబుతారేమోనని వృత్తిలో భాగంగా ఆయా వ్యక్తి చెప్పిన ప్రాంతానికి గణేష్ ను కలిసేందుకు వెళ్లాను.
ఖమ్మం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో గుండాల సమీపంలోని తూరుబాక అనే గ్రామం చేరుకున్నాను. నేను అక్కడికి వెళ్లేసరికి నేను పనిచేస్తున్న వార్త పత్రిక స్థానిక విలేకరి నాగేశ్వర్ రావుతోపాటు, మరో ముగ్గురు, నలుగురు ఖమ్మం రిపోర్టర్లే ఉన్నారు. ఓహో విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నారు కాబోలునని మనసులోనే అనుకున్నాను. తూరుబాకలో ఓ ఇంటి ముందు అరగంట సేపు వేచి ఉన్నాక, ఓవ్యక్తి వచ్చి మమ్మల్ని పక్కనే గల అడవుల్లోకి తీసుకువెళ్లాడు. కనీసం అరగంట సేపు అడవిలోకి నడిచాక నక్సల్స్ కనిపించారు. రాత్రి వేళ కావడంతో నక్సల్స్ ముఖాలు పెద్దగా కనిపించడం లేదు. ఇంతలో ఏకే-47 ధరించి ఓ వ్యక్తి వచ్చి టార్చ్ లైట్ వెలుతురులో తనను తాను గణేష్ గా పరిచయం చేసుకున్నాడు. అప్పటి వరకు వేర్వేరు సందర్భాల్లో జంపన్న, చలమన్న, ప్రసాదన్న, సత్తెన్న వంటి నక్సల్ నేతలను వృత్తిలో భాగంగా కలిశాను.. కానీ గణేష్ ను చూడడం మాత్రం అదే మొదటిసారి. పార్టీపరమైన అంశాలపై, ప్రభుత్వ వైఖరిపై తాను చెప్పదల్చుకున్న విషయాలను చెప్పాక, అన్నలూ.. మళ్లీ కలుద్దాం.. అని గణేష్ మాకు వీడ్కోలు చెబుతుండగా..!
‘కామ్రేడ్.. మీతో కాస్త మాట్లాడాలి…’ అన్నాను నేను. మాట్లాడన్నా.. అని గణేష్ అన్నారు. లేదు కాస్త పర్సనల్ గా మాట్లాడాలి అన్నాను. అలాగా.. అయితే రా అన్నా.. అని దాదాపు 100 మీటర్ల దూరం మరింత అడవిలోకి తీసుకువెళ్లాడు. ఏందన్నా.. విషయం? అని గణేష్ ప్రశ్నించారు. గోవిందరావుపేటలో ఈనాడు విలేకరిగా పనిచేసి పోలీస్ ఇన్ఫార్మర్ గా నక్సల్స్ హిట్ లిస్టులోకి ఎక్కిన కృష్ణారావు అనే సహచర జర్నలిస్టు విషయంలో ప్రతిఘటన పార్టీ నాయకుడు చలమన్నతో వాదించి అతని ప్రాణాన్ని కాపాడిన అనుభవమో, ఏటూరునాగారం అభయారణ్యంలో పెరిగిన వాతావరణమో తెలియదుగాని గణేష్ తో ఒకింత ధైర్యంగానే విషయం మాట్లాడాను. మేడారం-రెడ్డిగూడెం గ్రామాల్లో మీ పార్టీకి చెందిన మధు నాయకత్వంలోని తాతన్న దళం స్థానికులను కొందరిని ఇబ్బంది పెడుతూ భయోత్పాతానికి గురి చేస్తోంది.. ఆలం రామ్మూర్తి (మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మెన్ గా పనిచేశారు)ని, జంగా సాయిరెడ్డి అనే వ్యక్తుల విషయంలో మీవాళ్లు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదు. ఇప్పటికే ఆ ఇద్దరి విషయంలో తాతన్న దళం కాస్త అతిగా వ్యవహరించిందని పేర్కొన్నాను.
నిజానికి ఇది ఆ పార్టీ స్థానిక నాయకులపై, కేడర్ పై ఫిర్యాదు చేసినట్లే. కానీ నేను ఆయా కోణంలో ఆలోచించలేదు. అప్పటికే హిట్ లిస్ట్ లోకి ఎక్కించిన సాయిరెడ్డి అనే వ్యక్తి విషయంలో వాస్తవాలు నివేదించే ప్రయత్నం మాత్రమే చేశాను. ‘సాయిరెడ్డి, ఆలం రామ్మూర్తిల గురించి నాకూ సమాచారం ఉంది.. వాళ్లు పోలీసులకు సహకరిస్తున్నారు’ అని గణేష్ అన్నారు. ‘వాళ్లు స్థానిక నాయకులు.. ప్రజల అవసరాల కోసం పోలీస్ స్టేషన్ కు ఎక్కువసార్లు వెళ్లినంత మాత్రాన ఇన్ఫార్మర్లుగా, పోలీసులకు సహకరించే వ్యక్తులుగా మీరు ఎలా ముద్రవేస్తారు? అర్థరాత్రి, అపరాత్రి వేళల్లో వచ్చినపుడు మీవాళ్లకు కూడా అన్నం పెట్టిన సందర్భాలు లేవా? రవాణాకు వాళ్ల ట్రాక్టర్లను మీవాళ్లు తీసుకువెళ్లిన సమయాలు లేవా? నక్సలైట్లు సహకరిస్తున్నారంటూ పోలీసులూ వాళ్లను ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు లేవా? ’ అని నేను ప్రశ్నించాను.
‘ఇన్ఫార్మర్.. అనే అంశంలో మీకో ఘటన గుర్తు చేస్తున్నాను. కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లిలో ఓ నక్సల్ ఎన్కౌంటర్ కు సంబంధించి దాదాపు 16 మందిని ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి చంపేశారు. ఒకే ఎన్కౌంటర్ లో 16 మంది ఇన్ఫార్మర్లుగా ఎలా వ్యవహరిస్తారు? మీ అనుమానం నిజమే అయితే సమాచారం ఇచ్చేది ఒక్కరే కదా? మిగతా 15 మంది అమయకులేగా? ఇదే పాయింట్ పై నేను కరీంనగర్ లో పనిచేసినపుడు వార్తా కథనం కూడా రాశాను.. అందువల్ల సాయిరెడ్డి విషయంలో ఆధారాలు ఉంటే చూపండి.. అతన్ని నేనే తీసుకువచ్చి మీకు అప్పగిస్తాను..’ అని అన్నాను.ఇటువంటి అనేక అంశాలతోనే దాదాపు గంట సేపు ఇద్దరి మధ్య వాదన జరిగింది.
అయితే ఇప్పుడేమంటావ్ సమ్మన్నా? అని గణేష్ ప్రశ్నించారు. ‘మీరు రాసుకున్న హిట్ లిస్ట్ నుంచి సాయిరెడ్డిని తీసేయాలి’ అని కోరాను. ‘నేను ఓసారి స్థానికంగా విచారించి నిర్ణయం తీసుకుంటాను. అప్పటి వరకు ఏమీ చెప్పలేను’ అని మాట ఇచ్చిన గణేష్ కొద్ది నెలల తర్వాత సాయిరెడ్డిని హిట్ లిస్ట్ నుంచి తీసినట్లే.. ఇక ఏ ఇబ్బందీ ఉండదని నాకు సమాచారం పంపారు. ఆ తర్వాత నక్సల్స్ నుంచి మరెప్పుడూ తాను ఇబ్బంది పడినట్లు సాయిరెడ్డి నాకు చెప్పలేదు. వాస్తవానికి నక్సలైట్లు తమ హిట్ లిస్టులో చేర్చిన వ్యక్తులను అంత ఆషామాషీగా తొలగించరనే పేరుంది. అయినప్పటికీ ఓ ప్రాణాన్ని కాపాడాలనే తాపత్రయంతో ఓ ప్రయత్నం చేశాను. సాయిరెడ్డి కరోనా మహమ్మారితో వెంటాడిన అనారోగ్యంతో పోరాడి.. పోరాడి ఏడాది క్రితమే తుదిశ్వాస విడిచారు. అన్నట్లు సాయిరెడ్డి ఎవరో చెప్పలేదు కదూ..?
సాయిరెడ్డి నా బంధువే. బంధువుగా భావించి నేను గణేష్ తో అంతగా వాదన చేయలేదు. బంధువు కానటువంటి జర్నలిస్ట్ కృష్ణారావు ప్రాణాన్ని కాపాడే బాధ్యతను వరంగల్ జిల్లా జర్నలిస్ట్ నాయకులు దాసరి కృష్ణారెడ్డి తదితరులు నాపై బాధ్యతను మోపినపుడు చేసినటువంటి ప్రయత్నాన్నే సాయిరెడ్డి విషయంలోనూ చేశాను. కృష్ణారావును కాపాడడానికి తాడ్వాయి మండలం లింగాల అడవుల్లో నారవేప చెట్టు కింద ఎంతగా చలమన్నతో వాగ్వాదం చేశానో, బంధువైన సాయిరెడ్డి విషయంలోనూ గణేష్ తో అదే ప్రయత్నం చేశాను. ఈ రెండు ఘటనల్లో నేనేమీ గొప్ప విజయం సాధించానని ఫీలవడం లేదుగానీ, జర్నలిస్టుగా నాకు లభించిన అవకాశంతో ఇద్దరి ప్రాణాలను రక్షించగలిగాననే సంతృప్తి మిగిలింది… గణేష్ నిన్న ఎన్కౌంటర్ లో మరణించాడనే వార్త రాసిన తర్వాత గుండాల అడవుల్లోని ఆయా దృశ్యం మళ్లీ గుర్తుకొచ్చింది.. అంతే!
Post a Comment