నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి..
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..
భూపాలపల్లి కలెక్టరేట్, 9 ఏప్రిల్:భూపాలపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ఈ నెల 26వ తేదీన మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు, మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు బుధవారం భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడివోసి కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, టాస్క్ ప్రతినిధి ప్రదీప్ రెడ్డి మరియు అన్ని శాఖల జిల్లా, మండల అధికారులతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన భూపాలపల్లి లోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ అండ్ ఇండస్ట్రీయల్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేసి, జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతకు వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెజ్యూమ్, విద్యార్హత జిరాక్సులు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులకు ఏర్పాట్లు చేయాలి..
ఈనెల 26వ తేదీన భూపాలపల్లి లో జరిగే మెగా జాబ్ మేళాలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చే నిరుద్యోగ అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. ఈరోజు బుధవారం సాయంత్రం భూపాలపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాల నుండి వచ్చే నిరుద్యోగ అభ్యర్థులకు రవాణా సౌకర్యంతో పాటు, మంచినీరు, భోజన ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండల అధ్యక్షులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
Post a Comment