హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఫామ్-18 దరఖాస్తుల గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసినా పట్టభద్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పోర్టల్ ఆదివారం మధ్యాహ్నం నుంచి పనిచేయకపోవడంతో పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెబ్‌సైట్ ఓపెన్ చేయగానే ‘ఎర్రర్ 503.. సర్వీస్ ఈజ్ అన్‌అవైలబుల్’ అనే సందేశం రావడంతో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. సోమవారం రాత్రి వరకు కూడా ఈ సమస్య కొనసాగింది.ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న సమయంలో సర్వర్లు మొరాయించడంతో పట్టభద్రుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై స్పందించిన సీఈవో సుదర్శన్‌రెడ్డి పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను సరిచేసి సేవలను పునరుద్ధరిస్తామని తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
Post a Comment