సన్నూరు ఆలయ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలిరూ.10 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులపై కలెక్టర్‌తో ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి సమీక్ష

వరంగల్: సన్నూరు స్వయంభూ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఆలయ నిర్మాణ, పునర్నిర్మాణ పనుల పురోగతిపై వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ (SDF) నిధుల కింద రూ.10 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. 111.08 × 111.08 అడుగుల విస్తీర్ణంలో కోనేరు నిర్మాణానికి రూ.261.89 లక్షలు, అనివెట్టి మండపానికి రూ.57.28 లక్షలు, శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.15.94 లక్షలు, 1,344 అడుగుల ప్రాకార గోడ నిర్మాణానికి రూ.242.24 లక్షలు కేటాయించారు. పోర్టికో మండపానికి రూ.39.89 లక్షలు, శివాలయ నిర్మాణానికి రూ.120 లక్షలు, ఆలయ సుందరీకరణకు రూ.60 లక్షలు కేటాయించారు.ఇప్పటివరకు అనివెట్టి మండపం, పోర్టికో మండపం, ప్రాకార గోడ, ఔటర్ ప్రాకార గోడ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అనివెట్టి, పోర్టికో మండపాల సుందరీకరణ, ప్రాకార గోడ ప్రవేశ ద్వారాల నిర్మాణం, కోనేరు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఆలయం, శివాలయ నిర్మాణ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది.ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటిపై ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కలెక్టర్ సత్యశారదతో చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా మిగిలిన నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేయాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post