పరకాల: త్వరలో జరగనున్న వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు పరీక్షగా నిలవనున్నాయని, మూడేళ్ల కాంగ్రెస్ పాలనపై పట్టభద్రులు తమ ఓటు ద్వారా స్పందించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం పరకాల మండలం నాగారం గ్రామంతో పాటు పరకాల పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై నిర్వహించిన వేర్వేరు సమీక్షా సమావేశాల్లో పార్టీ ఇంచార్జి సాంబారి సమ్మారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాలు, వార్డుల వారీగా ఓటరు నమోదు పురోగతిని సమీక్షించి, నమోదు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను నాయకులు, కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఆరేళ్లకోసారి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఒక్కో హామీకి ఒక్కో సాకు చెబుతూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.సాగునీరు అందించలేని పరిస్థితికి ఎల్‌నినోను సాకుగా చూపడం సరికాదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతుంటే తెలంగాణలోని ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం, దేవాదుల వంటి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు నీరందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు కరువు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను పట్టభద్రులు గమనించాలని కోరారు.వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.పార్టీ ఇంచార్జి సాంబారి సమ్మారావు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా పట్టభద్రులను గుర్తించి, గతంలో ఓటరుగా నమోదైన వారు సైతం తాజా నిబంధనల ప్రకారం తిరిగి నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment