పెద్ది స్వప్నకు సమన్వయ బాధ్యతలు..!
గురువారం తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లా నేతలతో కేటీఆర్ కీలక భేటీ
జిల్లా నేతలకు క్లారిటీ ఇవ్వనున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
కేడర్‌ను గాడిలో పెట్టేందుకు తాత్కాలిక ఇన్చార్జి
పెద్ది కుటుంబ ప్రాధాన్యానికి భంగం లేకుండా వ్యూహం
BLN తెలుగు దినపత్రిక బ్యూరో : వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ రాజకీయాల్లో నాయకత్వంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి తాత్కాలికంగా అప్పగించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు గురువారం ఉదయం తెలంగాణ భవన్లో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో జరగనున్న సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పెద్ది సతీమణి స్వప్న సుదర్శన్‌రెడ్డికి ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించకుండా, పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసేందుకు మరో నేతను ముందుకు తీసుకురావాలన్నది అధిష్ఠానం ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడితే నర్సంపేటలో నాయకత్వంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడనుంది.
పెద్ది మరణంతో నాయకత్వ శూన్యత
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేటలో బీఆర్ఎస్కు బలమైన పునాది నిర్మించారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించడంతోపాటు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఆయన అకాల మరణం పార్టీకి రాజకీయంగా, కేడర్ పరంగా లోటుగా మారింది. అప్పటి నుంచి నియోజకవర్గాన్ని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. తాత్కాలికంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, దీర్ఘకాలిక కార్యాచరణకు స్పష్టమైన నాయకత్వం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నర్సంపేట నియోజకవర్గానికి తాత్కాలిక ఇన్చార్జిగా పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని నియమించే అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా స్థానిక నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడంతోపాటు పార్టీ కార్యక్రమాలను క్రమబద్ధీకరించవచ్చని అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. గురువారం తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో ఈ నిర్ణయాన్ని జిల్లా నేతలకు తెలియజేసే అవకాశముంది. నియామకం తాత్కాలిక స్వరూపంలోనే ఉండనుందన్న ప్రచారం నేపథ్యంలో, పోచంపల్లి పాత్ర నియోజకవర్గ రాజకీయాలకు దిశానిర్దేశం చేయనుంది. అయితే బాధ్యతల కేటాయింపుపై తుది స్పష్టత పార్టీ అధికారిక ప్రకటనతోనే రానుంది.
స్వప్న రాజకీయ భవిష్యత్తుపై వ్యూహం
పెద్ది స్వప్న సుదర్శన్‌రెడ్డికి రాజకీయ అనుభవం ఉంది. గతంలో నల్లబెల్లి జడ్పీటీసీగా, వరంగల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంలోనూ ఆమె కీలకంగా వ్యవహరించారు. అందువల్ల ఆయన మరణం తర్వాత నియోజకవర్గంలో ఆమె పాత్రపై సహజంగానే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించకుండా, ఆమెకు తగిన సమయం ఇచ్చి, మరో నేత ద్వారా పార్టీ కార్యకలాపాలను కొనసాగించాలన్న ఆలోచన ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇది పెద్ది కుటుంబాన్ని పక్కనపెట్టే నిర్ణయమా, లేక తాత్కాలిక నిర్వహణ కోసమేనా అన్నది పార్టీ స్పష్టతనుబట్టి తేలనుంది. పోచంపల్లికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ముందున్న ప్రధాన సవాలు కేడర్‌ను ఐక్యంగా ఉంచడమే. పెద్ది సుదర్శన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసిన స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడపాల్సి ఉంటుంది. నాయకత్వ మార్పు సమయంలో స్థానికంగా ఏర్పడే అసంతృప్తిని నివారించడం, గ్రామస్థాయి పార్టీ నిర్మాణాన్ని చురుకుగా ఉంచడం కీలకం. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోటీలు లేదా అంతర్గత విభేదాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా తాత్కాలిక ఇన్చార్జిపైనే ఉంటుంది. అందుకే నియామకంతోపాటు పార్టీ శ్రేణులకు అధిష్ఠానం ఇచ్చే సందేశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణ భవన్ భేటీపై ఉత్కంఠ
గురువారం ఉదయం జరగనున్న సమావేశం నర్సంపేట నాయకత్వానికి సంబంధించి కీలక మలుపుగా మారనుంది. పోచంపల్లి నియామకంపై స్పష్టత ఇవ్వడంతోపాటు వరంగల్ జిల్లా పార్టీ వ్యవహారాలపై నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పెద్ది కుటుంబంతో సమన్వయం ఎలా కొనసాగాలి, స్వప్న సుదర్శన్‌రెడ్డికి భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు కల్పించాలి, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రస్తుతానికి పోచంపల్లికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలన్నదే ప్రధాన రాజకీయ పరిణామంగా కనిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే నియామకం, బాధ్యతల పరిధి, తదుపరి కార్యాచరణపై పూర్తి స్పష్టత రానుంది.
Post a Comment