వరంగల్: రానున్న దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక బాణాసంచా విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు కోరే వారు నవంబర్ 2వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో కూడిన పూర్తి దరఖాస్తులను సంబంధిత డీసీపీ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
దరఖాస్తుకు అవసరమైన ధ్రువపత్రాలు
బాణాసంచా విక్రయాలకు అనుమతి పొందాలనుకునే వారు దరఖాస్తుతో పాటు అగ్నిమాపక శాఖ జారీ చేసిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), స్థల యజమాని లేదా సంబంధిత ప్రభుత్వ అధికారి అనుమతి పత్రం, జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పించాలి. గతంలో లైసెన్స్ పొందిన వారు దాని ప్రతిని జతచేయాలి. అవసరమైన చోట్ల పక్క స్థలాల యజమానుల అనుమతి పత్రాలు, విక్రయ కేంద్రానికి సంబంధించిన సైట్ ప్లాన్ బ్లూప్రింట్ కూడా సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.
రూ.800 బ్యాంకు చలాన్ తప్పనిసరి
దరఖాస్తుతో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆధాలత్ శాఖలో ప్రభుత్వ ఖజానాకు రూ.800 చెల్లించిన బ్యాంకు చలాన్‌ను జతచేయాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం సంబంధిత డీసీపీ స్థాయి అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు జారీ చేస్తారని తెలిపారు.
అనుమతులు లేకుంటే చర్యలు
ఎలాంటి అనుమతులు లేకుండా బాణాసంచా విక్రయాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత హెచ్చరించారు. వ్యాపారులు ముందుగానే దరఖాస్తు చేసుకుని, నిబంధనలను పాటిస్తూ అనుమతులు పొందాలని సూచించారు.
Post a Comment