వివాదంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు కుసుమ అరుణ విజ్ఞప్తి

శాయంపేట, జూలై 4 (BLN తెలుగు దినపత్రిక): హనుమకొండ జిల్లా శాయంపేట మండల శివారులోని సర్వే నంబర్ 405/1/2లో తనకు చెందిన భూమిని అక్రమంగా ఆక్రమించి అన్యాయం చేస్తున్నారని బాధితురాలు కుసుమ అరుణ ఆరోపించారు. శనివారం శాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
2008లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నం. 1499/2008 ద్వారా, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పట్టా పాస్‌బుక్ ఆధారంగా తనకు 1 ఎకరం 20 గుంటల భూమి ఉందని తెలిపారు. అయితే అదే భూమిని మామిడి తిరుపతమ్మ, అల్లం విజయలక్ష్మి దౌర్జన్యంగా ఆక్రమించి తమను భూమిలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తాము వ్యవసాయం చేసేందుకు వెళ్లిన ప్రతిసారీ దుర్భాషలాడుతూ, బెదిరింపులకు పాల్పడటమే కాకుండా రెవెన్యూ అధికారులు, పోలీసులను తప్పుదోవ పట్టించి తమపై అక్రమ కేసులు నమోదు చేయిస్తున్నారని వాపోయారు.
రెవెన్యూ రికార్డుల ప్రకారం మామిడి తిరుపతమ్మ పేరుపై ప్రస్తుతం 4 ఎకరాల 4 గుంటల భూమి మాత్రమే ఉండాల్సి ఉండగా, 5 ఎకరాల 24 గుంటల భూమి ఉన్నట్లు తప్పుడు వివరాలు చూపిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇదే సర్వే నంబరులో అల్లం విజయలక్ష్మి పేరుతో కూడా 1 ఎకరం 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
2025లో అప్పటి ఎంఆర్వో ఇచ్చిన నివేదికలో అనేక తప్పులు ఉన్నాయని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా నివేదిక రూపొందించారని విమర్శించారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సమక్షంలో పక్క భూయజమానుల వాంగ్మూలాలు తీసుకున్నప్పటికీ వాటిని తుది నివేదికలో పొందుపరచలేదని ఆరోపించారు.
గత ఐదేళ్లుగా లేని భూమికి రైతుబంధు సాయం పొందుతున్నారని పేర్కొంటూ, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. భూ సర్వే నిర్వహించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, తమకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆమె వేడుకున్నారు.
ఈ అంశానికి సంబంధించిన భూ పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు తదితర ఆధారాలను అధికారులకు సమర్పించినట్లు కుసుమ అరుణ తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post