BLN తెలుగు దినపత్రిక ప్రతినిధి / శాయంపేట, ఏప్రిల్ 21:
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో స్టోన్ క్రషర్‌ల వల్ల పర్యావరణం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ యూనిట్ వల్ల గ్రామం నష్టపోతుండగా, అదే ప్రాంతంలో మరో కొత్త క్రషర్ ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
గ్రామ శివారులో ఉన్న గుట్టలు ఒకప్పుడు సహజ రక్షణ కవచాలుగా ఉండేవని, ప్రస్తుతం క్రషర్‌ల కోసం జరుగుతున్న తవ్వకాలతో అవి క్రమంగా కనుమరుగవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిరంతర బ్లాస్టింగ్ కారణంగా గుట్టలు ధ్వంసమవడమే కాకుండా భూగర్భ జలమట్టం పడిపోతున్నదని, భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇక క్రషర్ యూనిట్ మరియు డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న దుమ్ము, రసాయన కణాలు పంటలపై పేరుకుపోతుండటంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. మొక్కల పెరుగుదల తగ్గిపోవడం, దిగుబడి పడిపోవడం వల్ల రైతులకు ఆర్థికంగా నష్టాలు వాటిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది.
అదేవిధంగా, క్రషర్ వ్యర్థాలు చెరువులు, కుంటల్లో చేరి నీటిని కలుషితం చేస్తున్నాయని, దీని వల్ల జలచరాలు నాశనం అవుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో సాగునీటి సరఫరా కూడా దెబ్బతింటున్నదని వారు పేర్కొన్నారు.
ఈ సమస్యలు పత్తిపాకకే పరిమితం కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయని, స్టోన్ క్రషర్‌ల కారణంగా రోడ్లు ధ్వంసమవడం, ప్రజలు శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న క్రషర్‌లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బ్లాస్టింగ్ పనులను నిలిపివేయాలని, చెరువులను శుద్ధి చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి యూనిట్‌లో దుమ్ము నియంత్రణ పరికరాలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతున్నారు.
పత్తిపాక ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్‌ను ఎందుకు మూసివేయకూడదో అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ముదిరాజ్ సమన్వయకర్త పల్లెబోయిన సుధాకర్ డిమాండ్ చేశారు. గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుని గుట్టలు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
లేనిపక్షంలో భవిష్యత్ తరాలకు కాలుష్యం, నీటి ఎద్దడి మాత్రమే మిగిలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
Post a Comment