మేడారం ప్రమాద బాధిత బాలుడికి ప్రభుత్వ సహాయం చెక్కుమంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేత

ములుగు, ఏప్రిల్ 18:
మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన బాలుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలిచింది. శనివారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) చేతుల మీదుగా బాధిత కుటుంబానికి దేవాదాయ శాఖ తరఫున ఆర్థిక సహాయం చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి (ఈఓ) మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అత్యుత్తమ వైద్యం అందించామని తెలిపారు. బాలుడి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించిందని వెల్లడించారు.
బాలుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అతని పేరుమీద ఆర్థిక సహాయాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో బ్యాంకులో జమ చేసినట్లు తెలిపారు. అలాగే కుటుంబ పోషణ కోసం బాలుడి తల్లికి మేడారం వనదేవతల సన్నిధిలో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించి నెలకు రూ.18,000 వేతనం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
బాలుడు పూర్తిగా కోలుకున్న తర్వాత నాణ్యమైన కృత్రిమ కాలు అమర్చడంతో పాటు, ప్రయాణ సౌకర్యార్థం స్కూటీ కూడా అందజేయనున్నట్లు ఈఓ వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు, బాలుడి తల్లిదండ్రులు మరియు ఇతరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post