శాయంపేట, ఏప్రిల్ 28:
భక్తులు కోరిన కోరికలను తీర్చే కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ మత్స్యగిరి స్వామి వారి వార్షిక తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమవుతున్నాయి. శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన ఆలయంగా పేరుగాంచిన ఈ క్షేత్రం కాకతీయుల కళావైభవానికి ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలోనే రెండో మత్స్యగిరి స్వామి పుణ్యక్షేత్రంగా ఇది విశేష ఖ్యాతిని సంపాదించుకుంది.
ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఐదు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు వైభవంగా నిర్వహించేందుకు దేవాలయ ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆలయ చరిత్ర
శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లయ్య గుట్టపై సుమారు 570 సంవత్సరాల క్రితం శ్రీ మత్స్యగిరి స్వామి కొలువుదీరినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంగా స్వామివారు ఇక్కడ వెలిసినట్లు విశ్వాసం. గుట్టలో సహజసిద్ధంగా బండరాయిపై చేప ఆకారంలో స్వామివారి రూపం దర్శనమిస్తుంది.
శిలాశాసనాల ఆధారంగా ఈ ప్రాంతంలో ఒకప్పుడు 14 దేవాలయాలు, 24 మంది అర్చకులు ఉన్నట్లు తెలుస్తోంది. కాకతీయ సామంత రాజు రేచర్ల దర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ, సింగమ నాయుడు స్మారకార్థం ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం గ్రామం మధ్యలో రాతితో నిర్మించిన ఆలయం గోపురంపై మహావిష్ణు దశావతారాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
కార్యక్రమాల వివరాలు
బుధవారం ఉదయం అధ్యాయనోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం పుట్ట బంగారు సేవ, మధ్యాహ్నం ధ్వజారోహణం, గరుడ ముద్ర ప్రసాదం నిర్వహించబడుతుంది. సంతానం లేని దంపతులు గరుడ ముద్ర స్వీకరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఉంది. రాత్రి ఎదురుకోళ్లు జరుగుతాయి.
ఏప్రిల్ 30 గురువారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం, మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహిస్తారు. మే 1న పూర్ణాహుతి, సాయంత్రం గజవాహన సేవ జరుగుతుంది. మే 2న రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మే 3న చక్రవర్తి, నాకబలి, పుష్పయాగం, ద్వాదశ ప్రదక్షిణాలు, పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని దేవాలయ అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Post a Comment