తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలపై విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెషనల్ ట్యాక్స్ తప్పనిసరిగా చెల్లించాలని సూచిస్తూ, ట్యాక్స్ వసూలు బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈఓలు) అప్పగించింది.
ట్యాక్స్ వసూలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. అలాగే ట్యాక్స్ చెల్లించని పాఠశాలలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.
ఫీజుల దందాకు చెక్
ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై దృష్టి సారించింది. శాస్త్రీయంగా, పారదర్శకంగా ఫీజులు నిర్ణయించే విధానాన్ని అమలు చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 11 వేల ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులు, గత మూడు సంవత్సరాల ఆదాయ-వ్యయాల వివరాలను సేకరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి రెండేళ్లకు ఒకసారి గరిష్టంగా 8 శాతం మాత్రమే ఫీజు పెంచుకునేలా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఎంఈఓలు, డీఈఓల సర్వే
మండల విద్యాధికారులు (ఎంఈఓలు), జిల్లా విద్యాధికారులు (డీఈఓలు) ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో ప్రస్తుతం ఎంత ఫీజు వసూలు చేస్తున్నారు? ఏ తరగతికి ఎంత వసూలు చేస్తున్నారు? అనే వివరాలను సేకరిస్తున్నారు. బేస్ ఫీజును ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయించాలన్న అంశంపై కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
త్వరలో పబ్లిక్‌కు ఫీజుల డ్రాఫ్ట్
ఫీజుల డ్రాఫ్ట్‌ను పారదర్శకంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోనుంది.
డీఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుల వివరాలు, ప్రతి పాఠశాల ఎంత ఫీజు వసూలు చేయబోతోందన్న సమాచారం కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ప్రైవేట్ పాఠశాలల్లో పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు.
Post a Comment