శాయంపేట మండలంలోని మైలారం గ్రామ శివారులో ఉన్న కోస్టల్ ప్రాంతం నుండి మట్టిని యదేచ్ఛగా విక్రయిస్తున్న 18 మంది రైతులపై కొందరు వ్యక్తులు విలేకరుల పేరుతో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు మండలంలో కలకలం రేపుతున్నాయి.
స్థానిక సమాచారం ప్రకారం, మట్టివిక్రయాల విషయం తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు విలేకరులమని చెప్పుకుంటూ ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం రైతులను బెదిరిస్తూ, “మండలంలో ఉన్న విలేకరులకు డబ్బులు ఇవ్వాలి” అంటూ డిమాండ్ చేసినట్లు తెలిసింది. భయాందోళనకు గురైన రైతులు మొదటగా రూ.31 వేల రూపాయలు అందజేసినట్లు సమాచారం.
ఇంతటితో ఆగకుండా, రెండు రోజుల తరువాత మళ్లీ అదే వ్యక్తులు వచ్చి, “మండలంలోని అధికారులకు కూడా డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మీ ట్రాక్టర్లు, జేసీబీలు సీజ్ చేయిస్తాం" అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో రూ.30 వేల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన మండలం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డబ్బులు వసూలు చేసిన వారిపై మిగతా విలేకరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు విలేకరుల పేరుతో బ్లాక్మెయిల్ దందాలకు పాల్పడి, నిజాయితీగా పని చేస్తున్న మీడియా ప్రతినిధుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతటి ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, నిజానిజాలు వెలికితీయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Post a Comment