BLN తెలుగు దినపత్రిక:అత్మకూరు, ఫిబ్రవరి 25: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత క్రమంలో దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి తెలిపారు.బుధవారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపురం, గూడెప్పాడు, మల్కపేట గ్రామాలలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వీట్లు తినిపించి, శాలువాలతో సన్మానించి, కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరమని, పేదల కళ్లలో ఆనందం చూడటం తాను గర్వంగా భావిస్తున్నానన్నారు. ఇందిరమ్మ ఇళ్లు లేని గ్రామాలు లేకుండా చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రతి గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమైన పథకాలు, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అమలులోకి వచ్చాయని అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post a Comment