వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్‌పేషెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, మందుల సరఫరా, వైద్య సేవల పరిస్థితిని ఎంపీ స్వయంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న చికిత్సపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, వరంగల్ జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి మూడు ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. దీని కారణంగా ఈఎస్ఐ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి సౌకర్యాలను ఇప్పటి నుంచే బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిని తనిఖీ చేసినట్లు తెలిపారు.
తనిఖీ అనంతరం వైద్యులు, నర్సులు, సిబ్బందితో సమావేశమై ఆసుపత్రి నిర్వహణ, సౌకర్యాల లోటుపాట్లు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వైద్యుల ఖాళీల భర్తీ, మందుల కొరత, శానిటేషన్ పరిస్థితులపై ప్రత్యేకంగా సమీక్షించారు. ఆసుపత్రికి అవసరమైన నిధులు, వసతులు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కార దిశగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
అలాగే ఆసుపత్రి పరిసరాల్లో పరిశుభ్రతను మెరుగుపరచాలని, జంగిల్ క్లియరెన్స్ చేపట్టి తక్షణమే శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ బి. సాంబశివరావు, ఆసుపత్రి సివిల్ సర్జన్స్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, డాక్టర్ అశోక్, డాక్టర్ రామచంద్ర, ఆర్‌ఎంఓ డాక్టర్ యుగేందర్ తదితర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment