శాయంపేట, నవంబర్ 26:
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి గురువారం శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, గన్నీ బ్యాగుల సరఫరా తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ప్రైవేట్ రైస్ మిల్లర్లకు వడ్లు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ కూడా అందిస్తోందని తెలిపారు.అనంతరం కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే గన్నీ బ్యాగులను తెప్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్, ఆర్ఐ ఏ. చిమన్ నాయక్, స్థానిక సర్పంచ్ మంద దీన ప్రభాకర్, జీపీఓ బోగి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment