హనుమకొండ, జూన్ 17: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బుధవారం హనుమకొండకు రానున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తన అభిమానిని పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ నగరానికి రానుండటంతో ఆయన పర్యటన మార్గంతో పాటు సందర్శించే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, సీఐ మచ్చ శివకుమార్ తదితర పోలీసు అధికారులతో కలిసి పర్యటన ప్రాంతాలను సందర్శించిన సీపీ, భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా బందోబస్తును మరింత కట్టుదిట్టం చేయాలని సీపీ ఆదేశించారు. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
Post a Comment