వాతావరణ అనుకూల వ్యవసాయానికి రైతులు ముందుకు రావాలినర్సంపేటలో ఘనంగా "ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్" కార్యక్రమంఏడబ్ల్యూడీ పద్ధతి అమలు చేసిన రైతులకు ప్రోత్సాహక నగదు పంపిణీ

నర్సంపేట, జూన్ 13:
వ్యవసాయంలో నీటి పొదుపు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ట్రాయ్ కన్సర్వ్ సర్వీసెస్, మిట్టి ల్యాబ్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫార్మర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్" కార్యక్రమం శుక్రవారం నర్సంపేటలోని ఎంఏఆర్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) పద్ధతిని విజయవంతంగా అమలు చేసిన రైతులకు ప్రోత్సాహక నగదు (ఇన్సెంటివ్స్) అందజేశారు. వరి సాగులో నీటి వినియోగాన్ని తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన రైతులను వేదికపై ఘనంగా సత్కరించారు. రైతుల కృషికి గుర్తింపుగా అందించిన ప్రోత్సాహకాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ముఖ్యంగా ఏడబ్ల్యూడీ వంటి నీటి పొదుపు సాంకేతికతలను విస్తృతంగా అమలు చేయడం ద్వారా సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా దిగుబడులు, ఆదాయం కూడా మెరుగుపడతాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డా. శ్రీనివాస్, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. టి. శ్రీకాంత్, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డా. పి. గోన్య నాయక్, వ్యవసాయ అధికారులు కృష్ణకుమార్, శ్రీనివాస్, మిట్టి ల్యాబ్స్ సహ వ్యవస్థాపకులు దేవదత్ దలాల్, బెంజిమెన్ మ్యాథ్యూ, ట్రాయ్ కన్సర్వ్ సర్వీసెస్ డైరెక్టర్ ఉమేష్ కాట్రపెల్లి, మేనేజర్ చిరాజు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపూర్, నల్లబెల్లి, పర్వతగిరి, వర్ధన్నపేట తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు వాతావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులపై ఆసక్తి కనబరుస్తుండటం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post