బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌కు సీఎం ఆమోదం

నిర్మల్ జిల్లా బాసరలోని పవిత్ర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాచీన ఆలయాన్ని సుమారు రూ.225 కోట్ల వ్యయంతో సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు రూపొందించిన ప్రణాళికపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ నెల 6వ తేదీన ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
భవిష్యత్ అవసరాలు, భక్తుల పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తారమైన రహదారులు నిర్మించాలని సీఎం సూచించారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయాలని, అభివృద్ధి పనులు అద్భుతంగా ఉండాలని ఆదేశించారు.
తిరుమల తిరుపతి తరహాలో ఆలయ పరిసర ప్రాంతాల్లో రాజకీయ కార్యకలాపాలకు పూర్తిగా నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. అలాగే ఆలయ పరిసరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేముల నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post